||సుందరకాండ. ||

||తత్త్వదీపిక-నలుబది రెండవ సర్గ ||

||హనుమంతుని జయఘోష!||


||ఓమ్ తత్ సత్||


సుందరకాండ.
అథ ద్విచత్వారింశస్సర్గః

తత్త్వదీపిక
నలుబది రెండవ సర్గ

హనుమంతుని జయఘోష

నలభై ఒకటవ సర్గలో హనుమంతుడు ముందుకార్యక్రమముపై ఆలోచించి
అశోకవనము ధ్వంశము చేయుటకు నిశ్చయించుకొని
చెట్లను పడగొట్టసాగెను అని విన్నాము

నలభైరెండవ సర్గ,
"తతః పక్షినినాదేన వృక్షభఙ్గ స్వనేన చ|
బభూవుస్త్రాససంభ్రాన్తాః సర్వే లఙ్కానివాసినః||"
అనే శ్లోకముతో మొదలవు తుంది.

అంటేఅలాగ హనుమ చెట్లను పడగొట్టుతూవుంటే,
ఆ లంకావాసులు అందరూ పక్షుల నినాదములతోనూ,
చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ భయభ్రాంతులు అయ్యారు. .

మృగములు పక్షులు భయముతో శబ్దము చేసినవి.
రాక్షసులు క్రూరమైన శకునములు చూసిరి.
వికృతమైన ముఖములు కల రాక్షసులు నిద్రనుంచి మేలుకొని భగ్నమైన వనమును,
భగ్నము చేస్తున్న వీరుడగు మహాకపిని చూచిరి.
మహాబలము మహాసత్త్వము గల ఆ వానరుడు ఆ భయపడిన రాక్షసులను చూచి
మహత్తరమైన రూపమును ధరించెను.

అప్పుడు పర్వతాకారముతో సమానమైన కాయముగల
మహాకాయుని మహాబలుడు అగు వానరుని చూచి
ఆ రాక్షసులు జనకాత్మజని అడిగిరి.
"ఇతడు ఎవరు? ఎవరి వాడు?
ఎక్కడినుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినవాడు?
నీతో అతడు ఏమి మాట్లాడినాడు?
ఓ సౌభాగ్యవంతురాలా భయము వలదు.
ఓ అసితేక్షణా అతడు నీతో ఏమి మాట్లాడెను? చెప్పుము" అని.

అందుకు సర్వాంగసుందరీ మహాసాధ్వి అయిన సీత ఇట్లు పలికెను.

"భీమరూపులైన రాక్షసుల గతి గురించి నాకు ఎలా తెలుయును?
మీకే తెలిసిఉండాలి, ఇతడు ఎవరో ఎందుకువచ్చాడో ఏమి చేయగోరుచున్నాడో?
పాముయొక్క గుర్తులు పాములకే తెలియును కదా.
అందులో సందేహము లేదు.
నేను కూడా భయములో ఉన్నాను.
ఇతడెవరో నాకు తెలియదు.
ఇలావచ్చిన ఇతడు కామరూపులు అగు రాక్షసులవాడే అని అనుకొంటాను" అని.

ఇక్కడ సీత అసత్యము పలుకుతుంది.
హనుమ తన ప్రాణరక్షకుడు.
నిజము చెప్పినచో రాక్షసులు ఆ హనుమను పట్టుకొని హించించెదరు.
నిజము చెప్పకున్న అసత్య దోషము వచ్చును.
హనుమద్రక్షణమే ముఖ్యము అని,
అసత్య మాడుటచే వచ్చిన పాపము తను పొందిననూ పరవాలేదు అని తలచి,
సీత ఈ విషయములో అసత్యము పలుకుతుంది.

హనుమ ఆచార్యుడు.
సీతమ్మ శిష్యురాలు..
ఆచార్యుని రక్షణకు శిష్యుడు అసత్య మాడినను దోషము లేదు.
శిష్యుడు గురువుయొక్క రక్షణకు తాను జాగరూకత వహింపవలెను.

అందుచే అమె అసత్యమాడినది.

రామాయణములో ఇంకోచోట కూడా ఇలా అసత్యము వింటాము.
రాముడు అయోధ్యనుండి బయటపడి అరణ్యమునకు వచ్చునపుడు
వెనుకనుండి దశరథుడు రథము నడుపుచున్న సుమంత్రుని ఉద్దేశించి ,
"ఆపుము" "ఆపుము" అనుచుండెను.
రాముడు సుమంత్రునితో
" రథము సందడిలో వినపడలేదని తండ్రిగారితో చెపుదువు.
ఇప్పుడు రథము పోనిమ్ము" అంటాడు.
ఒకరిని అసత్యమాడుమని చెప్పుట దోషమే కదా
మరి రాముడు ఎందుకు చేసెను అని ప్రశ్న వచ్చును.

వనవాసమునకు పోవుచున్న రాముని దశరథుడు ఆపినచో,
దశరథుడు తను ఇచ్చినమాట తప్పి అధర్మమునకు పాల్పడిన వాడగును.
దశరథుడు పుత్రవాత్సల్యముతో "ఆపుము ", "ఆపుము" అంటూ అధర్మమునకు పాల్పడుతున్నాడు.
అది గ్రహించాడు రాముడు.

తండ్రి ధర్మాచరణమునకు సమర్థుడు కానప్పుడు,
కుమారుడు తండ్రి పక్షమున ధర్మమును ఆచరింపవలెను.
తన తండ్రి రాజు.
రాజు దేశమునకు మూలము.
అతడు అసత్యవచనుడు కారాదు.
అతని సత్యమును నిలుపుటకు కుమారుడైననూ , మంత్రి అయిననూ అసత్యమాడవచ్చు.
అందుచే తండ్రిని సత్యవచనుడుగా చేయుటకు సమంత్రుని అసత్యమాడుమని చెప్పుట ధర్మ సమ్మితమే.

ఇదే ధ్వని కథోపనిషత్తులో వింటాము.
నచికేతుడు తన తండ్రి చేస్తున్న దానములను చూచి,
అట్టి దానములు చేసినవారు పుణ్యలోకములకు పోరు అని గ్రహించి,
తననే దానముగా ఇవ్వమని తండ్రితో అంటాడు.
తండ్రి చిరాకుతో నిన్ను యమునికి ఇస్తాను అని చెప్పుతాడు.
నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళడానికి సిద్దమైనప్పుడు ,
తండ్రి వెనకాడితే అది అధర్మమని,
మళ్ళీ నచికేతుడు తండ్రిని ఒప్పించి యమలోకానికి వెళతాడు.

అంటే అధర్మము చేయబోతున్న తండ్రిని నివారించడము పుత్రుని ధర్మము.
తండ్రిని ధర్మ మార్గమ్ములో ఉంచుటకు,
రాముడు అసత్యము పలకమని సుమంత్రునికి చెప్పుట ధర్మ సమ్మితమే.
హనుమ రక్షణకై సీత అసత్యము పలుకుట కూడా ధర్మ సమ్మితమే.

అప్పలాచార్యులుగారు ఇక్కడ ఇంకో మాట కూడా చెపుతారు.

ఇక్కడ అహి అంటే రెండు అర్థాలు వున్నాయి (1) పాము (2) అంతశ్శత్రువు.
రాక్షస స్త్రీలు సీతమ్మకి అంతశ్శత్రువులు.
హనుమ రాక్షసస్త్రీలకి అంతశ్శత్రువు.
అందుచే సీతమ్మ చమత్కారముగా
"అహిరేవ హ్యహేః పాదాని విజానాతి" అంటూ
'వాని జాడ మీకే తెలియును' అని చెప్పినది.
ఇక్కడ అసత్యము ఏమీ లేదు.

ఇంక జరిగిన కథ చూద్దాము.

వైదేహి వచనములను విని రాక్షసులు అన్ని దిశలలో పోయిరి.
కొందరు అక్కడే ఉండిపోయిరి.
కొందరు రావణునికి చెప్పుటకు వెళ్ళిరి.
కొందరు రాక్షసులు రావణుని వద్దకు పోయి
భయంకరరూపము గల వానరుని గురించి చెప్పిరి.
'ఓ రాజన్ అమితమైన భయము కలిగించు వానరుడు
సీతతో మాట్లాడి అశోకవనిక మధ్యలో ఉన్నాడు.
జానకి మాచేత అనేకవిధములుగా అడగబడినప్పటికీ వానిగురించి చెప్పుట లేదు.
అతడు ఇంద్రుడి దూతయో కుబేరుని దూతయో కావచ్చును,
అతడు సీతాన్వేషణగురించి రామునిచేత పంపబడిన వాడు కావచ్చును'.

' వానిచేత మనోహరమైన అనేక మృగములతో కూడి వున్న
ఆ ప్రమదావనము నాశనము అయినది.
అతనిచేత నాశనము చేయబడని స్థలము లేదు.
ఎక్కడ జానకి ఉన్నదో అక్కడ మాత్రము ధ్వంసము చేయలేదు.
జానకీ దేవి రక్షణకోసమో లేక శ్రమవలనో వదిలేసెనో మాకు తెలియదు.
వానిచేత ఎందుకు అది రక్షింపబడెనో తెలియదు.
సీత స్వయముగా కూర్చుని ఉన్న శింశుపావృక్షము అతనిచేత రక్షింపబడినది'.

ఆ రాక్షసులు రావణునితో ఇంకా ఇలా చెపుతారు.

" 'ఎవనితో' సీత సంభాషణ చేసెనో అతడు ఆ వనమును ధ్వంశము చేసెను.
ఆ ఉగ్రరూపముగల వానిని నువ్వు ఉగ్రమైన దండము విధించ తగును.
తన జీవితముపై ఆశవదిలినవాడు తప్ప,
ఎవడు రాక్షసాధిపును మనస్సును బంధించిన ఆ సీతతో మాట్లాడగలడు?' అని.

ఈ విధముగా రాక్షసుల వచనములను విన్న రాక్షసాధిపతి,
కళ్ళుతో ఉరుముతూ కోపము గలవాడై హుతాగ్ని వలె మండి పడెను.

'ఆ కోపము గలవాని కళ్ళనుండి ప్రజ్వరిల్లు తున్న దీపములనుండి
మంటతో కూడిన తైలబిందువులు రాలినట్లు అశ్రుకణములు రాలెను.
ఆ మహాతేజోవంతుడైన హనుమంతుని నిగ్రహించుటకు,
రావణుడు తనతో సమానమైన
కింకరులు అను పేరుగల రాక్షసుల సముదాయమునకు అదేశము మిచ్చెను.

ఆ సముదాయము మహత్తరమైన ఉదరము,
మహత్తరమైన పళ్ళు, ఘోరరూపము గల,
భయకరరూపముగల ఎనభైవేల కింకరుల సముదాయము.
ఆ కింకరుల సముదాయము యుద్ధము చేయుటకు మనస్సు గలదై,
హనుమంతుని బంధించుటకు ఆ భవనము నుండి వెడలెను.

వారు అశోకవన తోరణము పై ఆసీనుడైన కపీంద్రుని సమీపించి,
ప్రజ్వరిల్లు తున్న అగ్నిలోకి దూకిన కీటకుములవలే,
హనుమంతునిపై దూకిరి.
వారు విచిత్రమైన గదలతో పరిఘలతో బంగారు గదలతో
సూర్యునికిరణములవలె తేజరిల్లు తున్న శరములతో
వానరశేష్ఠునిపై దాడిచేసిరి.
ముద్గరములు పట్టిశములు శూలములు పట్టుకొని వేగముగా హనుమంతుని చుట్టుముట్టిరి.

తేజస్వి పర్వతాకారరూపము గల హనుమంతుడు
తన తోక ఝాడించి మహత్తరమైన నాదము చేసెను.
మారుతాత్మజుడు అయిన ఆ హనుమంతుడు తన కాయమును పెరిగించి,
లంకానగరము అంతా శబ్దముతో నిండునట్లు జబ్బలు చరిచెను.
ఆ మహత్తరమైన నాదముతో పలికిన శబ్దములతో
ఆకాశమునుండి పక్షులు నేలకు రాలినవి.
హనుమంతుడు గట్టిగా ఇట్లు ఘోషించెను.

'అతిబలవంతుడైన రామునికి జయము.
మహాబలుడైన లక్ష్మణునికి జయము.
రామునిచేత పరిపాలింపబడిన సుగ్రీవునకు జయము.
శత్రుసైన్యములను వధించగల మారుతాత్మజుడను నేను.
క్లిష్టమైన కర్మలను సాధించ గల రాముని దాసుడను.
వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ వున్న నన్ను
యుద్ధములో వేయి మంది రావణులు కూడా ఎదిరించలేరు.
రాక్షసులందరూ చూస్తూ ఉండగానే లంకను ధ్వంశము చేసి
మైథిలికి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'

ఇది హనుమ రాక్షసులను జయించుటకు ఉపయోగించు జయ మంత్రము.
ఈ శ్లోకాలు కూడా ప్రథమ వచనములో చెప్పబడుతాయి.
అందుకని ఈ శ్లోకములు మనము చదివినచో
మనకు కూడా విరోధులు తొలగి విజయము చేకూరును.
ఇదే ఆ జయమంత్రము.

"జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః|
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||33||
దాసోsహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతామారుతాత్మజః||34||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||35||
అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్"||36||

ఇక్కడ హనుమ తను రామదాసుడను అని ఘోషిస్తాడు.
శ్లోకము చదువుతున్న మనము కూడా
మనము రామదాసులము అని ఘోషిస్తున్నట్లే.
శ్లోకము చదువుతున్న మనము కూడా
రాముని కి జయము అని ఘోషిస్తున్నట్లే.
అందుకనే దీనిని జయమంత్రము అన్నారు.

ఇంకో మాట.
సీత హనుమను రక్షించడము కోసము హనుమ ఎవరో చెప్పదు.
కాని హనుమ తనంతట తానే తన గురించి చెపుతాడు.

మరింకోమాట.
ఇప్పటిదాకా హనుమ ఎప్పుడు దాసునిగా వర్ణించుకోలేదు.
ఇప్పటిదాకా హనుమ తను రామదూత అని,
సుగ్రీవుని సచివుడను అని చెప్పుకున్నాడు.
సీతమ్మను చూచిన తరువాత హనుమంతునికి తన స్వరూపము తెలిసెను.
ఆత్మకి సహజమైన రూపము భగవద్దాస్యమే

"దాసభూతాః స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః"
ఆత్మలన్నియూ పరమాత్మకు సహజముగా దాసులే అని చెప్పబడినది.
తాను ఏకార్యము చేయుచున్ననూ పరమాత్ముని దాసుడై వాని అతిశయనముకే చేయవలెను.
సర్వ శక్తిమతి అగు సీత రామునికే చెందినదై ఉండుట చూచి,
అట్టి స్వరూపమే ఆత్మగా ఎరిగి,
హనుమ తనను తాను దాసుడుగా చెప్పుకొనెను.

ఆ రాముడే తను చేయు సర్వకార్యములను
తన ద్వారా చేయించుచున్నడని గ్రహించెను.
ఆట్టి కర్మవలన వలన కలుగు అతిశయము ఆయనదే అని భావించును.
అలా భావించి రాక్షసులను జయించును.
మనము కూడా అలాగ ఆలోచించినచో
ఖేదము పొందక జయము పొందెదము.
అదే జయమంత్రము.

ఇక్కడ హనుమ చేస్తున్నది విరోధి నిరసనము.
అది శత్రువులను చంపుట,
దానిని చేయువాడు తనుకాదనియు,
ఆకర్మ తనది కాదనియు,
దానివలన కలుగి ప్రీతి తనది కాదనియు హనుమ భావించుచుండెను.
అలా భావించి కర్మ చేయుచుండెను.
అదే మనము కూడా అలవరచుకొనవలసిన జయ మంత్రము.

అలా తను రామదాసుడని చేసిన ఘోషణతో ఆ రాక్షసులందరూ భయపడినవారైరి.
అప్పుడు ఆ రాక్షసులు ప్రభువు ఆదేశానుసారము
చిత్ర విచిత్రములైన ఆయుధములతో కపి పై దాడి చేసిరి.
ఆ మహాబలుడు ఆ శూరులచే అన్నివేపుల చుట్టుముట్టబడి
తోరణముపై ఉన్న భయంకరమైన పరిఘెను తీసుకొనెను.

అతడు ఆ పరిఘను తీసుకొని నిశాచరులను కొట్టెను.
గరుత్మంతుడు మహాసర్పమును పట్టుకొని అకాశములో తిరిగినట్లు,
వీరుడు ఆ మారుతి ఆపరిఘను తీసుకొని తిరిగెను.
వీరుడైన ఆ మారుతాత్మజుడు కింకర సముదాయమును హతమార్చి,
మరల యుద్ధము చేయుటకు కోరిక గలవాడై మరల ఆ తోరణము ఆశ్రయించెను.

ఇక్కడ అప్పలాచార్యులవారు ఇంకా ఇలా చెపుతారు.

మనకు మూడు విరోధులు.
(1) నేను నావాడను అని అనుకోవడము
(2) తనను తాను రక్షించుకొన యత్నించుట
(3) తాను చేయు కర్మల తనవే అని వానిప్రీతి తనదే అనుకొనుట.

ఈ మూడింటిపై జయమే విరోధి జయము.
ఆ జయమునకు సాధనము మంత్రము.
అదే " రామ్ రామాయ నమః".
నమః అన్న పదాన్ని ఇదివఱకు విశ్లేషణము చేయడము అయినది.
మః అంటే 'నాది' , "న" అంటే కాదు అని.
ఒక కార్యము ముగించి 'నమః" అనుకుంటే ,
అది స్వామికి అర్పించి ఇది 'నాది కాదు" అని అనుకోవడమే.
చేసిన కర్మలన్నీ భగవంతునికే అర్పించినచో
ఆ కర్మల బంధములు మనని బంధించవు అని భగవద్గీతలో కూడా విన్నమాటే.
అదే ఇక్కడ కూడా వినపడే మాట.

అప్పుడు అక్కడ హనుమంతుని చూచి భయపడి పారిపోయిన కొందరు రాక్షసులు.
''కింకరులు అందరూ హతమార్చబడిరి" అని రావణుని కి నివేదించిరి.

ఆ రాక్షస రాజు
మహత్తరమైన కింకరుల బలగము హతమార్చబడినట్లు విని ,
కళ్ళు తిప్పుతూ అప్రతిమమైన పరాక్రమము గల
అజేయుడైన ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైరెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||